“వివేకా”హత్య..? సిబిఐకి “మచ్చ”..?

viveka c

అంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించి, వివాదంగా మారిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య ఉదంతం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. అనేక పరిణామాలు, అనుమానాల మధ్య కేంద్ర నేర పరిశోధన సంస్థ (సిబిఐ) చేతికి వెళ్లిన ఈ సంఘటన విచారణ తీరు పై సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సిబిఐ ప్రతిష్ట పై మచ్చ పడే సూచనలు కనిపిస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే పక్కా పథకం ప్రకారం జరిగిందని సాక్షాత్తూ సొంత చెల్లెలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుటుంబం చేస్తున్న బహిరంగ  ప్రకటనలు, ఆరోపణలు  ప్రతీ ఒక్కరిని విస్మయ పరుస్తున్నాయి. దీనికి తోడు ఐదేళ్లుగా వివేకా మృతి పై నోరు మెదపని జగన్ ఈ ఎన్నికల సమయంలో ఆ సంఘటన ఎందుకు, ఎలా జరిగిందో పులివెందుల, కడప జిల్లా వాసులకు తెలుసు అంటూ వ్యాఖ్యానించడం అంతుపట్టని వ్యవహారంగా ఉంది. షర్మిల, వివేకా కూతురు సునితల ఆరోపణలు, జగన్ మోహన్ రెడ్డి  వ్యాఖ్యలను నిపుణులు పలురకాల కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన అధికార, విపక్ష పార్టీలు ఐదేళ్ళ కిందట జరిగిన హత్య అంశాన్ని ప్రధాన ఎజెండాగా తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ ఎత్తుగడలను అన్వేషిస్తున్నారు.

సిబిఐ రంగంలోకి దిగినా వివేకా హత్య వెనుక కారణాలు వెతకడంలో ఎందుకు జాప్యం జరుగుతుందనేది సామాన్యుడు సైతం అదుడుతున్న మొదటి ప్రశ్న. వివేకా మొదట గుండెపోటుతో మరణించారని జరిగిన ప్రచారం వాస్తవమా లేక రాజకీయ పుకార్లా అనేది సిబిఐ తేల్చాల్సి నిజం. గత నెల రోజులుగా వివేకా ఘటన పై సొంత కూతురు, ఇతర కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలను సీబిఐ ఎందుకు పట్టించుకోవడం లేదనేది అనుమానాలకు దారి తీస్తోంది. ఏదో ఒక “క్లూ” ( ఆధారాలు) కోసం వెతికే నైతిక బాధ్యత గల సిబిఐ షర్మిల ఆరోపణలు, వివేకా భార్య, కూతురు సునీత మాటలను ఎందుకు ఖాతరు చేయడం లేదు. జగన్ ఫోన్ చేసి “వాళ్ళు ఎం చెబితే అది చెయ్” అంటూ అప్రువర్ గా మారిన వ్యక్తి మీడియాకు నేరుగా ఇచ్చిన మాటలను సిబిఐ ఎందుకు పట్టించుకోవడం లేదనే పలు అంశాలు అపోహలకు దారి తీస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జనానికి ఖచ్చితంగా సిబిఐ పనితీరు పై సందేహం రాక తప్పదు.  ఉదాహరణకు నోయిడాలో ఆరుషి హత్య కేసును అనేక అడ్డంకుల మధ్య ఛేదించిన  సీబిఐ, అనేక ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఉన్నా కేసు ఎందుకు ముందుకు సాగడం లేదనేది ప్రస్తుతం తలెత్తుతున్న అనుమానం. ఏ చిన్న ఆధారాన్ని వదిలి పెట్టని సిబిఐ షర్మిల, సునీత, అప్రువర్ల వాదనల పట్ల నిర్లిప్తంగా వ్యవహరిస్తోందా లేక వారి వాదనల్లో మరిన్ని వివరాల కోసం వేచి చూస్తోందా అనేది కూడా ఆలోచించాల్సిన అంశం. వివేకానంద రెడ్డి వ్యవహారంలో సిబిఐ సరైన వాస్తవాలను వెలికి తీయని పక్షంలో ముంబై రిఫైనరీ కేసులో సిబిఐకి సుప్రీం కోర్టు వేసిన అక్షింతలు ఈ కేసులోనూ పడక తప్పదని కొందరు సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముంబై రిఫైనరీ కేసు ఇప్పటికీ సిబిఐకి చెరుపుకోలేని మచ్చ కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *