అంధ్రప్రదేశ్ ఎన్నికల చదరంగంలో రాజకీయ వ్యవహారాలతో పాటు కుటుంబ తగాదాలు, కక్షలు భగ్గుమంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రస్తుత పరిస్థితి కనిపించ లేదు. ఏ ఎన్నికల్లో అయినా అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ జనాన్ని ఓట్లు అడిగే వారు. కానీ, ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారం మొత్తం కుటుంబాల పరువు, మర్యాదలను వీధులకు ఈడ్చుకునే రీతిలో ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్, ఆయన చెల్లెలు, ఆంధ్రా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల మధ్య దూసుకు వస్తున్న మాటల తూటాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు పొరుగు రాష్ట్రాల వారికి సైతం ఆసక్తిగా మారాయి. ఈ క్రమంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పై అటు జగన్, ఇటు షర్మిల, వివేకా కూతురు సునీత, ఆమె తల్లి లేవనెత్తుతున్న అంశాలు హార్రర్, సస్పెన్స్ సినిమా కథని తలపిస్తున్నాయి. అంధ్రప్రదేశ్ ఎన్నికల కనిపిస్తున్న ఐదు ప్రధాన పార్టీలు ప్రచారంలో వ్యక్తిగత విమర్శలే తప్ప ప్రజా సమస్యల పై గొంతెత్తి సందర్భాలే లేకపోవడం గమనించాల్సిన అంశం.

తెలుగుదేశం పార్టీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని బద్ధ శత్రువుగా భావిస్తూ గద్దె దించడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే, అందుకు తగ్గట్టు పాలనా పరమైన లొసుగులను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేక పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబు, పవన్ ల జగన్ వ్యక్తిత్వంపై విరుచుకు పడడం వారు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోవచ్చునని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదేవిధంగా జగన్ సైతం అధికార దర్పంతో బాబు, సేన, భాజపా పై వ్యాఖ్యలు చేయడం వింతగా కనిపిస్తోంది. ఓదార్పు యాత్రలో జనంతో జగన్ వ్యవహరించిన విధానం, లేవనెత్తిన అంశాలకు కొంత భిన్నంగా జగన్ పోకడ కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వైసిపి, తెలుగుదేశం, భాజపా, జనసేన పార్టీలకు చెందిన ఏ నేతల ప్రసంగాలను పరిశీలించినా సరే వాటిలో ప్రజలకు సంబంధించిన అంశాలు కనిపించక పోవడం విచారకరం. అధినేతల మధ్య స్పర్థలు ఎలా ఉన్నా నియోజక వర్గ స్థాయి నేతలైనా ప్రజా సమస్యలను తమ ఎజెండాలో చేరుస్తారనే ఆశలు కూడా కనిపించడం లేదు.
ఏం జరుగుతోంది “రాజన్నా”…!
ఇక అన్నా, చెల్లెళ్ళు జగన్, షర్మిల తీరు సైతం ప్రజలను అసంతృప్తి గురిచేస్తోందనే వాదనలు తలెత్తుతున్నాయి. బాధ్యత గల కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న షర్మిల ప్రతీ ప్రసంగాన్ని జగన్ ను విమర్శించడంతో మొదలు పెట్టి ఆయన సతీమణి భారతి పై ప్రత్యక్ష, పరోక్ష పై ఆరోపణలతో ముగించడం కనిపిస్తోంది. ఆంధ్రాలో అనేక రకాల ప్రజా సమస్యలు ఉన్న విషయం తెలిసి కూడా షర్మిల కేవలం వివేకానంద రెడ్డి హత్య వ్యవహారం, జగన్ దోపిడీ విధానాలు, ప్రభుత్వంలోనూ, రాజకీయాల్లోనూ భారతి పరోక్ష పెత్తనం, అవినాష్ రెడ్డిపై విమర్శలను ప్రధాన ఎజెండాగా జనంలోకి తీసుకువెళ్లడం నిజంగా వ్యక్తిగత కక్షగా కనిపిస్తోందనే చర్చకు తెర లేపింది. వాస్తవానికి ఏ జిల్లాలో ఏ సమస్య ఉందనే విషయం పాదయాత్ర సమయంలో షర్మిలకు తెలుసు. అవ్వన్నీ పక్కన పెట్టిన వ్యక్తిగత ఆరోపణలను ప్రచార ఆయుధాలుగా సంధించడం వెనుక ఉన్న రాజకీయం సామాన్యులకు అంతుపట్టడం లేదు.

ఇడుపులపాయ – లోటస్ పాండ్…!
షర్మిల వ్యాఖ్యలకు అదే స్థాయిలో జగన్ స్పందించడం మొదలు పెట్టారు. షర్మిల చంద్రబాబుని కలిసిన తీరుపై జగన్ వ్యంగ్యంగా మాట్లాడడం విశేషం. దీంతో ఎన్నికలు, ఓట్ల సంగతి ఏమో గానీ “జననేత” కుటుంబంలో ఆయన గతించిన తర్వాత అసలు ఏం జరిగిందనే వాస్తవం బయటకు వస్తుందేమో అనే ఆసక్తి జనంలో పెరుగుతోంది. అన్నా, చెల్లెళ్ల మాటల యుద్ధంలో ఇడుపులపాయలో గానీ , లోటస్ పాండ్ లో గానీ జరిగిన భాగోతం బయటకు పొక్కుతుందేమో అని కొన్ని వర్గాలు వేచి చూస్తున్నాయి వైసీపీకి ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి, ప్రత్యార్థులైన భాజపా, జనసేన పార్టీల నేతల ధీటుగా, పౌరుషంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సొంత చెల్లెలు షర్మిల ఇంటి గుట్టుని రచ్చబండపైకి తీసుకువెళ్లడం జగన్ కి మింగుడు పడడం లేదు. వీరి తల్లి విజయమ్మ కూడా కొడుకు, కూతురు మాటల యుద్ధంలో నలిగిపోయినట్టు కనిపిస్తోంది. అందుకే ఆమె కీలకమైన ఎన్నికల సమయంలో ఎవరి పక్షాన ఓటర్ల ముందు కొంగు చాసాలవ తెలియక అమెరికా పాయణమైనట్టు స్పష్టం అవుతోంది. ఎన్నికల సమయంలో ప్రజా సమస్యలను తెరపైకి తీసుకువచ్చి ఓట్లు రాబట్టాల్సిన రాజకీయ పార్టీల నేతలు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఎవరికీ వారు వ్యక్తిగత కక్షలను జనం మధ్య పెట్టడం రేపు జరిగే పోలింగ్ పై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజకీయంగా చైతన్యవంతులైన ఆంధ్రా ఓటర్లు ఈ సారి జరుగుతున్న ప్రచారాన్ని ఈ మేరకు “లైక్” చేస్తారో వేచి చూడాలి.