"సుప్రీమ్"ని ప్రశ్నించే ధైర్యమా… - EAGLE NEWS

“సుప్రీమ్”ని ప్రశ్నించే ధైర్యమా…

amit suprim c

ఎనిమిది, తొమ్మిదేళ్ళ కిందటి వరకు దేశ ప్రజలకు ఎవరో కూడా తెలియని వ్యక్తి ఈ రోజు న్యాయ వ్యవస్థను తప్పుపట్టే స్థాయికి చేరారు. ప్రజా స్వామ్య దేశం అందులోనూ పదేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నామన్న ఒకే ఒక ధైర్యంతో అధికారం,  పార్టీ బలం చూసుకొని షా  అదుపు లేకుండా మాట్లాడడం విస్మయానికి గురి చేస్తోంది. కేంద్రంలో బాధ్యత గల పదవిలో అంటూ దేశ ప్రధానికి కుడి భుజంగా పేరున్న అమిత్ షా ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలు, తీర్పూనే ప్రశ్నించే విధంగా మాట్లాడడం పట్ల న్యాయ రంగ నిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోహ్రభుద్దీన్ ఎన్ కౌంటర్ వ్యవహారాన్ని మర్చిపోయి సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలపై అమిత్ షా అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం ఆయన అధికార అహానికి నిదర్శనంగా ఉందనే వ్యాఖ్యలూ వెల్లువెత్తుతున్నాయి. మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు  సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

kejri mothr

వచ్చే నెల ఒకటో తేదీ వరకు పలు రకాల షరతులతో న్యాయమూర్తులు ఈ బెయిల్ మంజూరు చేశారు. అయితే, “సుప్రీం కోర్టు కేజ్రీవాల్ ని ప్రత్యేకంగా చూసిందని” అమిత్ షా  వ్యాఖ్యానించడం ఆశ్చర్యానికి గురి చేసింది. దేశానికి హోం శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నాయకుడు”సుప్రీం” ఆదేశాలను తప్పుపట్టే విధంగా మాట్లాడడం సమంజసం కాదనే చర్చలు గుప్పుమన్నాయి. ఢిల్లీ  మద్యం కేసులో కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న  పరిణామాలు,  తెర వెనుక రాజకీయ ఎత్తుగడలు దేశ ప్రజలకు తెలియని విషయం కాదని న్యాయ, రాజకీయ రంగ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ కు బెయిలు రావడం పై అమిత్ షాకు మింగుడు పడడం లేదనీ, అందుకే ఆయన అసహనాన్ని సుప్రీం కోర్టు తీర్పు పై వెళ్లగక్కుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గుజరాత్ లో సంచలనం రేపిన సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసు వ్యవహారాన్ని అమిత్ షా గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. గతాన్ని మరచి పోయి దేశ అత్యున్నత న్యాయస్థానం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, న్యాయ వ్యవస్థ పనితీరుని ప్రశ్నించే అర్హత ఆయనకు లేదని పేర్కొంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో “ఆప్” ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక అమిత్ షా సహనం కోల్పోయి మాట్లాడడం కేవలం అధికార అండతో బెదిరించడమే అనే విమర్శలూ వస్తున్నాయి. రాజకీయ నాయకులు ఇలా కోర్టు అనుమతులు, ఆదేశాలు, తీర్పుల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని న్యాయ వ్యవస్థను సులకన పరిచే విధంగా మాట్లాడితే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే వాదనలు తెర పైకి వస్తున్నాయి.

2 thoughts on ““సుప్రీమ్”ని ప్రశ్నించే ధైర్యమా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *