అకాడమీకి “రామోజీ” పేరెందుకు..!

ramojir c

రామోజీ రావు ఒక పత్రికకు అధిపతి. “ఈనాడు” పేరుతో ఆయన చేసింది సమాజ సేవ కాదు, అది ఒక వ్యాపారం. ఇది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పాఠకులకు, దేశ, విదేశాల్లో  అందరికీ తెలిసిన వ్యవహారమే. ఉమ్మడి “తెలుగుదేశం”లో నాలుగు దశాబ్దాలుగా ఎన్ని పత్రికలు వచ్చాయనేది బహిరంగ రహస్యమే. తెలుగు రాష్ట్రాల్లో “ఈనాడు” వెలుగు, జిలుగులకు ఒక్క రామోజీ ఆలోచనలే కారణం అన్నట్టు ఆయన మరణానంతరం  విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. కానీ,”ఈనాడు” శీర్షికలు, వ్యాసాలు, సంపాదకీయాలు తదితరాల వెనుక ఎవరు ఉన్నారనే నిజాన్ని కప్పిపుచ్చడం దుర్మార్గం. పత్రిక నడపడం అనేది ఒక వ్యక్తి వల్ల కాదు. అనేక మంది మేధావుల ఆలోచనల సమాహారమే దినపత్రిక కో. “ఈనాడు” పుట్టుక వెనుక ఆనాడు ఉన్నది సుప్రసిద్ధ పాత్రికేయులు ఎబికే ప్రసాద్ అనే వాస్తవం ఎందుకు బయటకు రావడం లేదు. ఆనాడు ఆయనే లేకపోతే రామోజీ “ఈనాడు”ఎక్కడ అనే నైతిక విషయం ఈనాటి తరం వారికి తెలియాల్సి ఉంది. 1970 దశకంలో కలం పట్టు ఉన్న ఏబికే ప్రసాద్ ని వెన్నెముకగా, రాతలకు బలంగా చేసుకొని విశాఖపట్నంలో 1974లో రామోజీ “ఈనాడు” పేరుతో  దినపత్రికకు ఊపిరి పోశారు. అప్పట్లో ఎబికే సంపాదకీయాలే దానికి ప్రాణం. రెండు,మూడు ఏళ్లకే “ఈనాడు”కు ఆక్సిజన్ లాంటి ఎ.బి.కె. ప్రసాద్ ని  తెలివిగా బయటకు పంపారు. అప్పటి అడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ నివేదికలను, ఆనాటి పరిస్థితిని విశ్లేషిస్తే అసలు విషయం తెలుస్తుంది. ఆ ఎ.బి.కె. ప్రసాద్ అనే అక్షరమే తర్వాత ఆంధ్రజ్యోతి, ఉదయం, వార్తా అనే తెలుగు పత్రికలకు పురుడు పోశారు. అలాంటి వ్యక్తి జాడ లేకుండా “ఈనాడు” భారం మొత్తం తనే మోసినట్టు రామోజీ అనుచరగణం ప్రచారం చేసుకోవడం నిజంగా విచారకరం. రామోజీ జీవిత కాలంలో అనేక మందికి ఉపాధి కల్పించారు. వాస్తవమే, కానీ నైపుణ్యం ఉన్నా తనది కానీ సామాజిక వర్గాన్ని ఎదగనివ్వలేదనేది బహిరంగ రహస్యం. ఇప్పటికీ ఆ సంస్థలో ఉద్యోగులను లెక్కిస్తే ఈ వాస్తవం తేలిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ సమస్యే అణగారిన మేధావీ వర్గాన్ని ఆ సంస్థకు దూరం చేసింది.

ramoji exbshn

ఇక ఆంద్రప్రదేశ్ లో రాజధాని అమరావతి నిర్మాణానికి 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించిన  “ఈనాడు” ఎం.డి. కిరణ్,  నవ్యాంధ్ర రాజధాని పేరును, అమరావతి పేరును స్వర్గీయ రామోజీరావు సూచించారని చెప్పడం విడ్డూరంగా ఉంది. రాజధాని పేరు పెట్టడానికి, సూచనలు ఇవ్వడానికి అప్పట్లో ప్రభుత్వంలో సరైన అధికారులు, సలహాదారులు లేరా అనే సందేహం ఇప్పుడు కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికార పత్రికగా “ఈనాడు” పై చెరిగిపోని ముద్ర వేచిన రామోజీకి ఆంధ్రాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆయన అభిమాన పార్టీ నేతలు రుణం తీర్చుకోవాలని ఆలోచించడంలో ఎంత మాత్రం తప్పు లేదు. కానీ, పత్రికా రంగంలో విభిన్న వర్గాల వారు ఉంటారనే అంశాన్ని గుర్తిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆంద్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి రామోజీ పేరును యోచించడం పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు ఐదు దశాబ్దాలుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకొని కేవలం 1983 నుంచి పత్రిక మనుగడ కోసం తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతున్న రామోజీరావు పేరును ఆంద్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి ఎలా పెడతారనే ప్రశ్న తెరపైకి వస్తోంది. అంతే కాదు, హైదారాబాద్ హైటెక్ సిటీ రూపకల్పని నేనే అంటూ చెప్పే చంద్రబాబు అందులో రామోజీ సూచనలు కూడా ఉన్నాయని వెల్లడించడం కొత్త విషయం. అదేవిధంగా ప్రతిపాదిత ఆంధ్ర రాజధాని అమరావతి పేరుని కూడా రామోజీ రావు నిర్ణయించారని ప్రకటనలు చేయడం కూడా ప్రభుత్వంలో మేధావీ వర్గాన్ని విస్మయ పరుస్తోంది. స్వర్గీయ రామోజీ పై అభిమానంతో అనువైన ప్రదేశంలో స్మారకాలు ఏర్పాటు చేసుకోవచ్చు కానీ, అన్ని వర్గాల పాత్రికేయులు కలసి ఉండే ప్రెస్ అకాడమీకి ఆయన పేరుని ప్రతిపాదించడాన్ని ప్రభుత్వం మరోసారి ఆలోచించాలనే సూచనలు వస్తున్నాయి. పాత్రికేయ వృత్తినే శ్వాస గా మలచుకొన్న నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రాంమోహనరావు వంటి వారే కాక రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకొని సంస్కరణల పత్రిక నడిపిన కందుకూరి వీరేశలింగం వంటి మహానుభావుల పేర్లు ప్రెస్ అకాడమీ విషయంలో గుర్తుకు రాకపోవడం విచారకరమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *