తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను, సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన సమావేశ వివరాలను భట్టి వివరించారు.రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో పాటుమరో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. రెండు వారాల్లో సమావేశం కావాలని నిర్ణయించినట్టు, ఈ అధికారుల కమిటీలో పరిష్కారం కానీ అంశాల పై మంత్రుల కమిటీ వేయాలని కూడా ముఖ్యమంత్రుల భేటీ నిర్ణయించిందన్నారు. అప్పటికి సమస్యల పరిష్కారానికి అవరోధాలు ఉంటే తిరిగి ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ క్రైమ్ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయని భట్టి తెలిపారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రుల భేటీ తెలుగు జాతి హర్షించే రోజుగా పేర్కొన్నారు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అందరి సలహాలు తీసుకుని కూలంకషంగా చర్చించినట్టు చెప్పారు. అందరికీ మేలు జరిగేలా, రాబోయే రోజుల్లో కూడా మళ్లీ సమావేశమై చర్చించాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించినట్టు తెలిపారు. డ్రగ్స్ మహమ్మారి సమస్యలను ఇరు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారన్నారు.