ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఖండిస్తూ టిడిపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టాయి. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని నిలదీయడంతో పాటు రాక్షస పాలనకు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టడాన్ని జగన్ రెడ్డి జీర్ణించుకోలేక కక్షసాధింపు చర్యలకు దిగారని దుయ్యబట్టారు. తన అవినీతి మరకను ఇతరులకు అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే చంద్రబాబు అక్రమ అరెస్ట్ అని నిరసించారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల అవినీతికి పాల్పడడంతో పాటు 16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి ఈ సైకో జగన్ అని మండిపడ్డారు. చంద్రబాబు పై అవినీతి మరక అంటించాలనే వైసీపీ కుట్రలు ఫలించబోవని హెచ్చరించారు. చంద్రబాబు దంపతుల పెళ్లిరోజున ఇబ్బందులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు.చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ పలు నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు చేపట్టిన సామూహిక నిరాహారీ దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను గృహనిర్బంధం చేశారు. మరికొందరిని పోలీస్ స్టేషన్ కు బలవంతంగా తరలించారు.
పలు జిల్లాల్లో 144 సెక్షన్ పేరుతో గృహనిర్బంధాలు చేశారు. రాజమహేంద్రవరంలో టీడీపీ నేతలు ఆదిరెడ్డి శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి కోరుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కందుకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావును అక్రమంగా అరెస్ట్ చేసి వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. విశాఖ ఎంవీపీ కాలనీలో టీడీపీ నేతల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి తెలుగు మహిళలను బలవంతంగా వాహానాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాపట్లలో శాంతియుతంగా నిరసన చేపడుతున్న టీడీపీ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. చీరాలలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న నియోజకవర్గ ఇంఛార్జ్ ఎంఎం కొండయ్యను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడే తమ నిరసనను కొనసాగించారు.
రామచంద్రాపురం ఇంఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యంను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసి విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విజయవాడలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి గుణదల పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేసి విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమంలో పోలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గణబాబు, వెగుళ్ళ జోగేశ్వరరావు, డోలా బాలవీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మినారాయణ, నక్కా ఆనందబాబు, భూమ అఖిలప్రియ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, గొల్లా నరసింహయాదవ్, బి.కె పార్థసారధి, బి.టి నాయుడు, మల్లెల రాజశేఖర్ గౌడ్ నియోజకవర్గ ఇన్‌చార్జులు, నియోజకవర్గ పరిశీలకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.