అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వింత పోకడలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక పార్టీ పై మరో పార్టీ అడ్డూఅదుపూ లేని ఆరోపణలకు దిగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రాయలసీమ శైలిలో, మరికొన్ని సార్లు బెజవాడ తరహాలో ప్రసంగాలు సాగుతుంటే, ఇంకొన్ని సభల్లో ఏకంగా సినిమా డైలాగులను మరిపించే విధంగా మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగుదేశం నేతలపై మంత్రి రోజా చేస్తున్న ఘాటైన విమర్శలకు అదే స్థాయిలో రోజాపై టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి.
అంతేకాదు, రోజా పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యాఖ్యలు కూడా వ్యక్తిగత కక్షతో చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా అటు అంబటి , పేర్ని, కోడలి వంటి వైసిపి మంత్రులు, నేతలు సంధిస్తున్న మాటల భాణాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వైసిపి అధినేత, ఆ పార్టీ నేతలపై చేస్తున్న మాటల దాడిపై కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏదైనా రాజకీయ సంఘటన జరిగితే విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు ఆ విషయానికే పరిమితం అయ్యేవని, ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యక్తిగత వ్యవహారాలను తెరపైకి తీసుకురావడం వల్ల అసలు విషయం పక్క దోవ పట్టే దుస్థితి నెలకొందని పలువురు నేతలు పేర్కొంటున్నారు.
గత రెండు, మూడు నెలలుగా పలువురు నేతల ప్రసంగాలు, ప్రకటనలను పరిశీలిస్తే ఇలాంటి అనేక అర్పనలు, విమర్శలు కనిపిస్తాయి. ఇక వచ్చే ఎన్నికలు కురుక్షేత్రం అంటూ మొన్న జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా 151 మంది ఎం.ఎల్. ఎ.లు ఉన్నారు కాబట్టి ఆ కురుక్షేత్రంలో కచ్చితంగా వైసిపి వారే కౌరవులవుతారని అంటూ తామే పాండవులమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. ఈ వ్యాఖ్యల పై కూడా తిరిగి జనంలో, ఆయ పార్టీ శ్రేణుల్లో స్పందన, చర్చలు మొదలయ్యాయి. పాండవులు, కౌరవులు మీరైతే కురుక్షేత్రంలో కీలక భూమిక పోషించిన శ్రీ కృష్ణుడు, ద్రౌపది ఎవరనే వాదనలకు ఒక్కసారిగా తెర లేచింది. దీనిపై ఏ పార్టీ నేతలు ఏం వ్యాఖ్యలు చేస్తారో అని ప్రేక్షకులు, పాఠకుల్లో ఉత్కంఠ నెలకొంది. అత్యంత వాడీ, వేడిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే ఎన్నికలలో చేపట్టాల్సిన వ్యూహాలపై దృష్టి సారించాల్సిన నేతలు సినిమా డైలాగుల మాదిరిగా మాటలు సంధించుకోడం సీనియర్ నేతలకు, రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టడం లేదు.