టిడిపి-“సేన”లో పొత్తు చిచ్చు..!

babu pavan

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పెద్ద పార్టీలతో చేతులు కలుపుతున్న పార్టీల వ్యూహాలు సామాన్యులకు అంతు పట్టడం లేదు. గత ఎన్నికలలో అంటకాగిన పార్టీలు ఈ సారి ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ శత్రువులుగా మారాయి. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో బిజెపితో కలిసి తిరిగిన జనసేన ఈ సారి రూటు మార్చింది. మొన్నటి వరకు బిజెపి పెద్దలతో రాసుకు పూసుకు తిరిగి, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీతో కలిసి బరిలోకి దిగుతామని ప్రకటించిన “సేన” మనసు మార్చుకొని “సైకిల్” ఎక్కింది.

tdp logo
janasna logo

బిజెపి కలిసినా, కలవక పోయినా సరే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తామని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడుని రాజమండ్రి జైల్లో కలిసిన మరుక్షణమే పవన్ పొత్తు విషయాన్ని వెల్లడించారు. అయితే, జనసేన బిజెపిని ఎందుకు వీడిందనేది సామాన్యులకే కాదు రాజకీయ పరిశీలకులకు సైతం అంతుపట్టని ప్రశ్న. జైలులో జరిగిన పొత్తు చర్చలు బిజెపికి తెలిసే జరిగాయా లేక తెలుగుదేశం, జనసేన పార్టీల సొంత నిర్ణయమా అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. పొత్తు విషయాన్ని ప్రకటించిన పవన్ చంద్రబాబు అరెస్టు పై తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ఏ ఒక్క కార్యక్రమంలోనూ జనసేన నాయకులు గానీ, కార్యకర్తలు గానీ కనిపించక పోవడం గమనార్హం. పొత్తును తేల్చి చెప్పినప్పుడు ఆ రాష్ట్రంలో ఏ విధమైన కార్యక్రమాన్ని ఏ పార్టీ చేపట్టినా విధిగా రెండు పార్టీలు భాగం కావాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాపడుతున్నారు.

కొద్ది రోజులుగా చంద్రబాబు అరెస్టుపై గానీ, లోకేష్ సిఐడి నోటీసుపై గానీ, బండారు సత్య నారాయణ మూర్తి అరెస్టు విషయంలో గానీ పవన్ కళ్యాణ్ నోరు మెడపక పోవడాన్ని వివిధ పార్టీల నేతలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అంతేకాదు వచ్చే ఎన్నికలలో అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి పదవి చేపడతా అంటూ పవన్ చేసిన ప్రసంగం తెలుగుదేశం నేతలకే కాకుండా పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఇదిలాఉంటే, రానున్న ఎన్నికల్లో తెలంగాణాలో 32 శాసన సభ నియోజక వర్గాలలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు జనసేన ప్రకటించింది. ఈ విషయం కూడా చర్చకు దారి తీసింది. అంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న “సేన” తెలంగాణా లోనూ ఆ పార్టీతో ఎందుకు కలవలేదనేది ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్న సందేహం. తెలంగాణలో పోటీ విషయం చంద్రబాబు నాయుడుకి తెలిసే జరిగిందా లేదా అనేది రహస్యం.అయినా, తెలంగాణలో ఏ ప్రయోజనాన్ని ఆశించి, ఎవరి కోసం జనసేన ఎన్నికల బరలోకి దిగుతుందనే వాదనలకు తెరలేసింది. తెలంగాణలోని కొన్ని నియోజక వర్గాల్లో ఇప్పటికీ పట్టు సడలని తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన రంగంలోకి దిగితే కొంతైనా ఫలితం కనిపించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జనసేన ప్రకటించిన 32 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉందన్న విషయం గమనార్హం. అందుకే జనసేన ఎవరికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆయా నియోజక వర్గాల పై దృష్టి పెట్టిందనే బహిరంగ చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ ఎన్నికలలో పూర్తీ స్థాయిలో పోరాడుతామని తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ చేసిన ప్రకటన కొత్త చర్చకు దారి తీసింది. పొత్తు పెట్టుకునే విషయాన్ని చంద్రబాబు తేలుస్తారని బాలకృష్ణ చెప్పారు. కానీ, ఏ పార్టీతో కలిసి బరిలోకి దిగుతారనే విషయన్ని వెల్లడించ లేదు. దీన్ని బట్టి చూస్తే మొన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అధినేతతో చర్చించకుండానే 32 స్థానాలలో పోటీ చేసున్నట్టు ప్రకటించినట్టు తేలిపోయింది. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు టిడిపి వర్గాలే వెల్లడిస్తున్నాయి. ఆంధ్రా, తెలంగాణలో రాజుకుంటున్న పొత్తు చిచ్చును రెండు పార్టీల నేతలు ఎలా చల్లార్చుతారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *