గత రెండు దశాబ్దాలుగా ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు జనాకర్షణ కోసం సినీ నటులపై దృష్టి సారించేవి. ఏదో రకంగా వాళ్ళను రంగంలోకి దించేవి లేదా ఆసక్తి ఉన్న నటులే ముందుకు వచ్చి తమకు నచ్చిన పార్టీల పంచన చేరే వారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆ తంతు జాడ లేకుండా పోయింది.
గత ఎన్నికల వరకు కూడా సీట్లు, ప్రచారల్లో సందడి చేసిన “వెండి తారలు”ఈ సారి తెలంగాణ శాసన సభ ఎన్నికల తెరపై మాయమయ్యారు. బి.అర్.ఎస్., కాంగ్రెస్, బిజెపి వంటి ప్రధాన పార్టీలు దేనికదే సీనియర్లకు సీట్ల కేటాయింపు, గ్రుపుల కుమ్ములాటలుపై దృష్టి సారించడం వల్ల తారలకు టిక్కెట్లు దొరక లేదు. ఇరవై, పాతిక ఏళ్ళుగా వివిధ పార్టీలతో మమేకమై ఉన్న వారికే ఈ ఎన్నికల్లో దిక్కులేకుండా పోయింది. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కొందరు నటులు రాజకీయాల కంటే రంగుల ప్రపంచమే నయం అనుకున్నారేమో కనీసం ఫిలిం నగర్, చిత్రపురి దాటి బయటికి రావడం లేదు. ఏదో రూపంలో రాజకీయాల్లోకి రావాలని కొందరిలో ఆసక్తి ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మధ్య తట్టుకోవడం సాధ్యం కాదనే నిర్ణయానికి రావడం గమనార్హం. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి గానీ, ప్రచారానికి గానీ వాళ్ల నుంచి స్పందన లేదు. ఇక టిక్కెట్లు ఆశిస్తూ చిందు లేసిన వారి పరిస్థితిని పరిశీలిస్తే భవిష్యత్ లో ఎవరైనా రాజకీయాల వైపు చూస్తారా లేదా అనే సందేహం తలెత్తుతుందని ఫిలిం నగర్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. సీనియర్ తారలు విజయశాంతి, జయసుధలను అందుకు ఉదాహరణగా చూపున్నాయి.
తెలంగాణ కోసం సొంత పార్టీనే ఏర్పాటు చేసిన “రాములమ్మ” ప్రస్తుతం బిజెపితో అంటకాగుతోంది. ఈమె ఈ ఎన్నికల్లో బెర్తు ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు. కానీ, కొన్ని సమీకరణాలు ఆమెకు సీటు దక్కకుండా చేసినట్టు తెలుస్తోంది. మొన్నీ మధ్యన మరో నటి జయసుధ బిజెపి తీర్థం పుచ్చుకావడంతో సమస్య వచ్చినట్టు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీనికి కొన్ని ఉదాహణలు చూపుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో ఆ పార్టీ తెలంగాణ విభాగం మహిళా ర్యాలీ చేపట్టింది. ఇందులో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలోనే పార్టీలో తారల”సినిమా” మొదలైనట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రదర్శనకు విజయశాంతి గైర్హాజరు కావడం, జయసుధ ప్రధాన ఆకర్షణగా నిలవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బీజేపీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో విజయశాంతి అసంతృప్తితో ఉన్నారని,ఆమె పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయననే సమాచారం ఒక్కసారిగా గుప్పుమంది. ఆమె స్థానాన్ని జయసుధతో భర్తీ చేసిందని పలువురు వ్యాఖ్యానించారు. తెలంగాణను వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బిజెపిలో చేరడాన్ని విజయశాంతి తీవ్రంగా వ్యతిరేకించడం కూడా ఆ పార్టీలో కొందరికి మింగుడు పడలేదు. కొన్ని సందర్భాల్లో కిరణ్ కుమార్ రెడ్డితో వేదిక పంచుకోవడానికి సైతం ఆమె ఆసక్తి చూపక పోవడంతో కొందరు నేతలకు తలనొప్పిగా మారింది. మణిపూర్ హింసాకాండపై కూడా ఆమె చేసిన ట్వీట్ బీజేపీని విస్మయ పరిచింది. అంతేకాక కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రకటనలు, పోస్టులు పెట్టడం, సోనియా గాంధీ, రాహుల్ వ్యాఖ్యలకు వత్తాసు పలుకడంతో ఆమె మళ్లీ కాంగ్రెస్ నూలు ధరించే సూచనలు ఉన్నాయనే వార్తలు గుప్పుమన్నాయి.
ఇక, కాంగ్రెస్, వైసిపి అంటూ ఎన్నికల ప్రక్రియకు ముందు కమలం తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే జయసుధకు సైతం బిజెపి మొండి చెయ్యి చూపింది. మొన్నటి వరకు ఉమ్మడి హైదరాబాద్, రంగరెడ్డి జిల్లాలోని ఏదో నియోజక వర్గం నుంచి పోటీ చేస్తుందని భావించిన జీవిత కూడా ఎన్నికల పట్ల నిశబ్ధంగా ఉన్నారు. ఇవ్వన్నీ చూస్తుంటే పార్టీలు తారలను పట్టించుకోవడం లేదనేది ఒకవైపు, రాజకీయ పరిస్థితులు సైతం తారలను ఆకర్షించే విధంగా లేవనే వాదనలు మరోవైపు వినిపిస్తున్నాయి. దీంతో, ప్రస్తుతం అందోల్ నియోజక వర్గం నుంచి నటులు బాబూ మోహన్ ఒక్కరే తెలంగాణ ఎన్నికల రంగంలో నిలిచారు.తెలుగుదేశం పార్టీ హయంలో మంత్రిగా, బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎం,.ఎల్.ఎ.గా రాజకీయ అనుభవం ఉన్నబాబూ మోహన్ ఈ సారి బిజెపి నుంచి బరిలోకి దిగారు.