ఒంటెద్దు పోకడ-అతి ఆలోచనలు..!

surve 1c

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత  మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఉద్యమ పార్టీగా పిలవబడుతున్న బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు పోలింగ్ నాటికి ఒక్కసారిగా తిరగబడ్డాయి. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు పడుతున్న ప్రజలకు “ఒక్క ఛాన్స్” ఇవ్వడి అంటూ పక్కాగా అమలు చేసే ఆరు రకాల గ్యారంటీ పధకాలతో కాంగ్రెస్ పార్టీ , “హ్యాట్రిక్‌” విజయంపై గట్టి ధీమా పెట్టుకొని బీఆర్‌ఎస్‌ పార్టీ , “నేనే గ్యారంటీ” అనే మోడీ నినాదంతో బిజెపి  ఎన్నికల రంగలోకి దుకాయి. క్షేత్ర స్థాయి పరిస్థితులను పూర్తిగా అంచనా వేశారో లేదో ఎవరికీ తెలియదు కానీ, గతంలో ఎన్నడూ లేని విధంగా  రాష్ట్రంలోని 119 శాసన సభ నియోజక వర్గాల్లో త్రిముఖ పోటీ ఉంటుందని విస్తృతంగా ప్రచారం చేశాయి. బిజెపికి ఏడెనిమిది చోట్ల బలం ఉన్నదనే విషయం ఆ పార్టీ అధినాయకత్వానికే కాదు కింది స్థాయి కార్యకర్తలకు సైతం తెలియనిది కాదు. అయినా, ఆ పార్టీ త్రిముఖ పోటీ ఉంటుదని ఒకసారి, కాదు పోటీ బిఆర్ఎస్, బిజెపిల  మధ్యనే ఉంటుందని మరోసారి ప్రకటనలు గుప్పింది. వివిధ సంస్థలు చేపట్టిన సర్వే నివేదికల్లో అటు బిఆర్ఎస్ ఇటు  బిజెపిల  ఆశలు గల్లంతయ్యే అవకాశాలు బయటపడ్డాయి. ఏడెనిమిది సంస్థలు నిర్వహించిన సర్వేలలో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారనే గణాంకాలు కేంద్ర, రాష్ట్రాలలోని అధికార పార్టీలకు దిమ్మతిరిగేలా చేశాయి.  పీపుల్స్‌పల్స్‌ సంస్థ రాష్ట్రంలో నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ప్రకారం ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య కంటే బీఆర్‌ఎస్‌ ప్రజల మధ్యనే జరిగినట్టు తెలుస్తోంది. రెండుసార్లు  బీఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చాం, ఇప్పుడు మార్పు కోరుకుంటున్నామని ఓటర్లు సర్వేలో చెప్పినట్టు, కాంగ్రెస్‌కు ఆరు గ్యారెంటీల కంటే ప్రభుత్వ వ్యతిరేకతే కలిసివచ్చిందని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పీపుల్స్‌పల్స్‌ సంస్థ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న సమయంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

survey in

బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. 2018 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత నెల నుంచే ప్రజలు కారుకు బ్రేకులు వేయడం మొదలుపెట్టారు. బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనే శక్తి ఉన్న పార్టీనే గెలిపిస్తూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 46.9 శాతం ఓట్లతో 88 సీట్లను, కాంగ్రెస్‌ 28.4 శాతం ఓట్లతో 19 సీట్లను గెలుచుకున్నాయి. ఇంత భారీ విజయం సాధించిన తర్వాత కూడా కేసీఆర్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవడం ప్రజలకు నచ్చలేదు. 2018 ఎన్నికల తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే వచ్చిన ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డిని గెలిపించారు. ఆరు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ‘కారు-సారు-పదహారు” నినాదంతో ముందు వచ్చిన బీఆర్‌ఎస్‌ 9, బీజేపీ 4, కాంగ్రెస్‌ 3 సీట్లు గెల్చుకున్నాయి.

surve

2018 ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సుమారు 19 శాతం ఓట్లు కోల్పోయింది. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కీలకనేత పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అతికష్టంగా తీన్మార్‌ మల్లన్నపై గెలిచారు.  దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు భంగపాటే ఎదురయ్యింది. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో గెలిచినా ఓట్ల శాతం మాత్రం పెరగలేదు. వామపక్షాల సహకారంతో మునుగోడు ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలిచి అనంతరం వారిని దూరం పెట్టారు. ఇలా ప్రతి ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతున్నా కేసీఆర్‌ దిద్దుబాటుకు ప్రయత్నించకుండా తనకు ఎదురే లేదన్నట్టు వ్యవహరించారని సర్వేల సారంశం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో తమ ఎజెండా ఇంకా పూర్తి కాలేదని ‘గుడ్‌ టు గ్రేట్‌’ నినాదంతో బీఆర్‌ఎస్‌ ప్రచారం సాగించింది. మరోవైపు  ఆశించినట్టు విధంగా పీఆర్సీ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, సమ్మె చేసిన సమయంలో కేసీఆర్‌ చేసిన అవమానాన్ని మర్చిపోలేని ఆర్టీసీ కార్మికులు ‘ఇక చాలు… మార్పు కావాలి’ అని ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సైలెంట్‌ ప్రచారం మొదలుపెట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా, కేసీఆర్‌ అతివిశ్వాసంతో రెండు నెలల ముందే దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం బీఆర్‌ఎస్‌కి నష్టం చేకూర్చే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. గ్రేటర్‌ ఎన్నికల్లో సిట్టింగ్‌ కార్పొరేటర్లకు తిరిగి టికెట్లు ఇచ్చి చేతులు కాల్చుకున్న కేసీఆర్‌ అదే తరహా పొరపాటును ప్రస్తుత ఎన్నికల్లోనూ చేస్తూ సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇచ్చారు. దీంతో కింది స్థాయి నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా మారింది. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, దళిత బంధు అందరికీ అందకపోవడం, బీసీ బంధు కొన్ని కులాలకే పరిమితం కావడం, నూతన రేషన్‌ కార్డులు ఇవ్వకపోవడం, నిరుద్యోగం, పంటకు కనీస మద్దతు ధర లభించకపోవడం, అవినీతి అంశాలు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రభావితం చూపించాయి. డబుల్‌ బెడ్రూం ఇండ్లు పూర్తిస్థాయిలో పంపిణీ కాకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత రెట్టింపయ్యింది. దళితబంధు అందరికీ ఇవ్వకపోవడం, ఇచ్చిన కొంతమందిలోనూ పార్టీ కార్యకర్తలే అధికంగా ఉండటం, వీటికి ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకున్నారని ఆరోపణలు బీఆర్‌ఎస్‌కు తీవ్రం నష్టం చేసినట్టు సర్వేలో వెల్లడయ్యింది. లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్‌ పలు సందర్భాల్లో లెక్కలు చెప్పినప్పటికీ ఉద్యోగాలు రాలేదనే తీవ్ర అసంతృప్తి యువతలో నెలకొంది. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని గతంలో చెప్పిన కేసీఆర్‌ మాట తప్పడమే కాకుండా, టీఎస్పీఎస్సీ కుంభకోణంతో యువత ఆగ్రహం రెట్టింపయ్యింది. రాష్ట్రంలో 35 ఏళ్లలోపు ఉన్న 90 లక్షల యువ ఓటర్లలో అధిక శాతం బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేసినట్టు సర్వేలో తేలింది.  రైతుబంధు ఇస్తున్నప్పటికీ రైతు రుణమాఫీ జరగలేదనే  రైతుల్లో ఉంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రచారంలో అస్త్రంగా వాడుకుంది. రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్‌ వైపే రైతులు మొగ్గు చూపినట్టు ఎన్నికల సరళి సూచిస్తోంది.

తెలంగాణ ఉద్యమ కాలం నుండి పార్టీలో ఉన్న వారిని కాదని అధినాయకత్వానికి భజన చేసే ‘బీటీ’ (బంగారు తెలంగాణ) టీమ్‌కు పార్టీలో ప్రాధాన్యత పెరిగిందనే భావన బీఆర్‌ఎస్‌లో ఏర్పడిరది. కాంగ్రెస్‌లో ని నేతలను  చేర్చుకొని ఆ పార్టీని బలహీనపర్చవచ్చని బీఆర్‌ఎస్‌ భావించింది. కానీ, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్‌  పార్టీ కేడర్‌ గురించి తక్కువ అంచనా వేసింది. మునుగోడులో విజయానికి బీఆర్‌ఎస్‌కు సాయపడిన కమ్యూ నిస్టులతో సయోధ్యగా ఉండి ఉంటే, బీజేపీకి బీఆర్‌ఎస్‌ ‘బీ’ టీమ్‌ అనే మచ్చ వచ్చేది కాదు. ఈ విధంగా జరిగి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో లౌకికవాదులు కూడా పార్టీ పక్షానే ఉండేవారు. ప్రగతి భవన్, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికే  పరిమితమయ్యే కేసీఆర్‌ పరిమితం అవుతున్నారనే భావన కూడా ప్రజల్లో కనిపిస్తోంది. మంత్రులకు, పార్టీ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరనే ప్రచారంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళాయి. వీరిని ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం చేశారనే విమర్శలు సర్వేలో వెలుగు చూశాయి. భారీ అంబేద్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారక కట్టడాలను కూడా ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణలో బాగుపడిరది కేసీఆర్‌ కుటుంబం మాత్రమే అని ప్రతిపక్షాల ఆరోపణలు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలుగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగడం గట్టి దెబ్బగా మారింది. అంతేకాదు, కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కలహాలుంటాయని కేసీఆర్‌, కేటిఅర్, హరీష్ రావు తప్పుగా అంచనా వేశారు.. ఆ పార్టీలో అరడజన్‌కుపైగా సీఎం అభ్యర్థులు ఉన్నా రని, టికెట్లు రానివారు తిరుగుబాటు అభ్యర్డులుగా పోటీ చేస్తారని బిఆర్ఎస్ నాయకత్వం భావించగా, పది సంవత్సరాలకుపైగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు అధికారమే లక్ష్యంగా అంతర్గత తగాదాలను పక్కన పెట్టి పనిచేసినట్టు సర్వేలలో బయట పడడం గమనార్హం. ఈ సర్వేల ఫలితాలు ఓట్ల లెక్కింపుతో సరితూగితే భారత రాష్ట్ర సమితి పరిపాలనలో నిజంగా ప్రజా విశ్వాసం కోల్పోయినట్టే అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.               

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *