ఆంధ్రప్రదేశ్ లో వడివడిగా మారిన రాజకీయ పరిణామాలు నిజంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల్లో అక్కడ జరగనున్న ఎన్నికల తంతు రెండు కుటుంబాల చుట్టూనే తిరిగే విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి రాజకీయ చదరంగంలోకి షర్మిల, పురందేశ్వరి రెండు ప్రధాన జాతీయ పార్టీల పగ్గాలు చేత పట్టు కోవడంతో ఆంధ్ర రాజకీయాల్లో కొంత కాలం కిందటి వరకు ఉన్న సమీకరణలు క్రమేపీ మారుతూ వస్తున్నాయి. రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు రెండు కుటుంబాల చేతిలోనే ఉండడం “ఆంధ్ర స్పెషల్ పాలిటిక్స్” గా చెప్ప వచ్చు. ఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ లేని రాజకీయ చదరంగం ప్రారంభమైంది. కాంగ్రెస్, బిజెపి, వైసిపి, టిడిపి ఈ నాలుగు పార్టీల సారధులు రెండు కుటుంబాలకు చెందిన వారే కావడం విశేషం. వీళ్ళలో ఇద్దరు రక్త సంబంధీకులు కాగా, మరో ఇద్దరు వదిన, మరిది కావడం ప్రత్యేకం.
ఆంధ్రలో జననేత రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసిపి తరపున ప్రాంతీయ పార్టీకి సారధ్యం వహిస్తుంటే, ఆయన సోదరి వై.ఎస్.షర్మిల జాతీయ పార్టీ కాంగ్రెస్ కి అధ్యక్షురాలైయ్యారు. అదేవిధంగా మరో జాతీయ పార్టీ బిజెపికి దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షురాలిగా ఉండగా, ఆమె మరిది నారా చంద్రబాబునాయుడు ప్రాంతీయ పార్టీ తెలుగుదేశంకి అధ్యక్షులుగా ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో బలమైన శ్రేణులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, రాజశేఖర్ రెడ్డి అకాల మరణం, తెలుగు రాష్ట్రాల విభజనతో ఆ పార్టీ ఒక్కసారిగా ఆంధ్రలో జవసత్వాలు కోల్పోయింది. జగన్ అప్పటి కాంగ్రెస్ అధిష్టానన్ని ఎదిరించి వైసిపిని ఏర్పాటు చేయడం, దాంతో కాంగ్రెస్ లో ఉన్న నేతలు జగన్ సరసన చేరడంతో ఆంధ్రలో పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఉనికినికి ముప్పు ఏర్పడింది. కెవిపి రామచంద్రరావు, రఘువీరా రెడ్డి వంటి నేతలు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నప్పటికీ వైసిపి, తెలుగుదేశం పార్టీల ధాటికి వెనుక పడ్డారు. అయితే, కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో చురుకుగా మారుతున్న రాజకీయాలు, జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం, అనేక ఇతర కారణాలను విశ్లేషించిన కాంగ్రెస్ అధిష్టానం అక్కడ ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో స్తబ్దంగా ఉన్న క్యాడర్ కి భరోసా కల్పించడం, జగన్ తో అంతర్గత విభేదాలు ఉన్న వైసీపీ నాయకులను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా పకడ్బందీ ఆలోచన చేసింది. అంతేకాక, పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో తిరుగులేని మెజారిటితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అధిష్టానంలో మరింత జోష్ పెరిగింది. తెలంగాణ ఎన్నికలలో తమకు సహకరించిన షర్మిలను పధకం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా నియమించింది. దీంతో షర్మిల సొంత అన్నయ్య జగన్ ప్రభుత్వం పైనే కాలు దువ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే ప్రస్తుతం కాంగ్రెస్, వైసిపిల మధ్య ఉన్న ఆసక్తికరమైన విషయం.
అదేవిధంగా ఆంధ్రలో క్యాడర్ ని పెంచుకోవాలనే లక్ష్యంతో భారతీయ జనత పార్టీ కొన్నినెలల కిందటే పావులు కదిపింది. అందులో పార్టీకి ఆ రాష్ట్ర అధ్యక్షురాలిగా చంద్రబాబు వదిన దగ్గుబాటి పురందేశ్వరిని నియమించి కొత్త సవాల్ కి తెర లేపింది. వైసిపితో తాడోపేడో తేల్చుకోడానికి చంద్రబాబు శతవిధాల పోరాటం చేస్తున్న తరుణంలో పురందేశ్వరి బిజెపి పగ్గాలు చేపట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డట్టయింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పురందేశ్వరి జగన్ ప్రభుత్వంపై విమర్శలు స్పందిస్తుంటే, మొన్న పగ్గాలు చేపట్టిన షర్మిల ఇటు జగనన్న ప్రభుత్వ వైఫల్యాలను తూర్పార పడుతూ, ధర్నాలకు దిగడ, మరోవైపు తెలుగుదేశం, బిజెపిల వైఖరిని ఎండగడుతూ జనంలోకి వెళ్ళడం రాజకీయ పరిశీలకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది. జగన్, షర్మిల మధ్య బహిరంగమైన పోరాటం ఎన్నికల వేడి రాజుకున్న తర్వాత ఎలా ఉండబోతోందనేది రచ్చబండల మీద చర్చలుగా మారాయి. అదే విధంగా చంద్రబాబు, పురందేశ్వరిల ప్రకటనలు, ప్రచారాలను సైతం సామాన్య జనం నుంచి రాజకీయ విశ్లేషకులు సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికార వైసిపి ప్రాంతీయ పార్టీ పై మరో ప్రాంతీయ పార్టీ టిడిపి సహా కాంగ్రెస్, బిజెపి ఈ రెండు జాతీయ పార్టీల ప్రచార సరళి ఏ తరహాలో ఉంటుందా అని సగటు ఓటర్లు వేచి చూస్తున్నారు.