తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరుగలేదని, ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలరెడ్డి, ఆమె అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో “క్విడ్ ప్రో కో” (నీకు అది – నాకు ఇది) తరహా పద్ధతి అవలంభించారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఆరోపించారు. షర్మిల కోటరీ వైఖరి వల్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అందించిన నిధులు సైతం గోల్ మాల్ అయ్యాయని వెల్లడించారు. అధిష్టానం షర్మిలని కాంగ్రెస్ చీఫ్ గా నియమించినపుడు పార్టీని బలోపేతం చేస్తారనే ఆశను తుంగలో తొక్కారని పద్మశ్రీ దుయ్యబట్టారు.
షర్మిల సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడతో పార్టీకి తీరని నష్టం చేకూర్చారని, సమర్థులైన వారికి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదని వివరించారు. ఎన్నికల్లో షర్మిల అవగాహన రాహిత్యం కాంగ్రెస్ పార్టీ క్యాడర్, నాయకులను నిరాశ,నిస్పృహలకు గురిచేసిందన్నారు. తెలంగాణకు చెందిన కొందరు షర్మిల అనునాయులు ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల టికెట్ అంశాల్లో జోక్యం చేసుకున్నారని, డబ్బులు ఇచ్చిన వారికి “బి”ఫారాలు అందజేశారని బలమైన ఆరోపణలు చేశారు. అంతేకాక, వర్కింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నేతలు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి వారి సూచనలు, సలహాలు షర్మిల పెడచెవిన పెట్టిందని వ్యాఖ్యానించారు.ఈ మేరకు షర్మిల నాయకత్వ వైఫల్యం పై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ కి పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

 
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
				 
				 
				 
				