నటునిగా ఆయనకు తిరుగు లేదు. 70 ఏళ్ల వయస్సు మీద పడుతున్నా, పాత తరానికే కాదు, నేటి యువతరానికి కూడా ఆయన తెరపై కనిపిస్తే ఆ మజానే వేరు. సినిమా హిట్టు, ప్లాప్ లతో సంబంధం లేదు. ఆయన బొమ్మ, స్టెప్పులు మాత్రమే చాలు అంతే అదే లెక్క. . అయితే, తనకున్న అశేష ప్రేక్షక ఆదరణతో ఏదో ఆశించి, ఎంతో ఊహించి”చిరు”వేచిన తప్పటడుగు రాజకీయ తెరపై మాత్రం కోలుకోలేని “ప్లాప్” ని ఇచ్చింది. ఉదయించే సూర్యుడు జెండాకు మాత్రమే పరిమితమై “ప్రజారాజ్యం” చూడకుండానే అనతి కాలంలోనే అంతర్థానం అయ్యాడు. 16 ఏళ్ల కిందట వెండితెర హీరో చిరంజీవి అట్టహాసంగా ప్రజల ముందుకు తీసుకు వచ్చిన ప్రజారాజ్యం పార్టీ సరైన దిశానిర్దేశం లేక క్రమంగా కనుమరుగైంది. దీంతో ఆయన మళ్లీ లైట్స్ ..,కెమెరా..,యాక్షన్ అంటూ క్లాప్ ల వైపు వెళ్ళారు.

ఇప్పుడు మళ్ళీ చిరంజీవి వైపు రాజకీయ గాలం మాంచి ఎరతో ఎదురు చూస్తున్నట్టు గుసగుసలు గుప్పుమంటున్నాయి. తన కోసమో,”తమ్ముడు” కోసమో తెలియదు గాని కొద్ది రోజులుగా ఆయన వ్యవహార శైలిలోనూ కాస్త మార్పు కనిపించడం రచ్చబండ వద్ద ఇలాంటి చర్చలకు దారి తీసింది. భారతీయ జనతా పార్టీ, మోడీ, షా వంటి ఆ పార్టీ ప్రముఖులతో “అందరివాడు” వ్యవహరిస్తున్న తీరు కూడా మరో కారణం. మొన్న సంక్రాంతి రోజు ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పండుగ ఉత్సవాల్లో ప్రధాని మోడీ సహా చిరంజీవి ప్రముఖంగా తళుక్కుమనడం వెనుక “స్క్రిప్ట్” ఏమిటనేది ఆసక్తికరంగా పరిణామం. దేశంలోని అనేక రాష్ట్రాలను ఎన్నికల రూపంలోనో లేక వేరే పద్ధతులలోనో కషాయంగా మారుస్తూ భారతీయ జనతా పార్టీ దక్షిణ ప్రాంతంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో కన్ను వేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో అవకాశం కోసం అన్ని విధాలుగా కాపు కాసుకొని కూర్చుంది. అందుకే కాబోలు ఆంధ్రా, తెలంగాణలో సంఖ్యా పరంగా బలంగా ఉన్న తెలుగుదేశం,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాపై నిర్ణయాత్మకంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం అందుతోంది. రాబోయే 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నట్టు, అందుకు కావలసిన దారులను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆంధ్రాలో గట్టి పట్టు మీద ఉన్న చంద్రబాబు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, వచ్చే ఎన్నికల్లో సొంతగా పోటీ చేయడం సాధ్యం కాని పని అని భాజపా అధినాయకత్వం అంచనా వేస్తోంది.

అందుకే, “అన్నయ్య, తమ్ముడు” ద్వయాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారంలో ఉంటూ మంత్రిగా ఆవేశం మీద ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ విలీనం అనుభవం ఉన్న చిరంజీవిల వైపు బిజెపి ఆశగా అడుగులు వేస్తోందని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు, “చేగువేరా” బొమ్మ పెట్టుకొని ఆయన రీతిలో తిరుగుబాటు అంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయ్యాక ఒక్కసారిగా “సనాతన ధర్మం” అనే నినాదానికి మారడం కూడా ఆయన భవిష్యత్ లో ఖచ్చితంగా బిజెపితో అంట కాగుతరణడానికి సంకేతమని సీనియర్ రాజకీయ నేతలు, పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బిజెపి “తమ్ముడు”ని తనవైపు తిప్పుకోవడానికి చిరంజీవిని వాడుకోవాలని ఎత్తులు వేస్తున్నట్టు కూడా బహిరంగ చర్చలు జరుగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి అనేక పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కేంద్ర పదవులు చేపట్టిన చిరంజీవి చివరకు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం జనం అనుకుంటున్నట్టు భాజపా జనసేనపై దృష్టి సారించి పవన్ తో సఖ్యత కోసం చిరంజీవిని రంగంలోకి దించితే అప్పుడు ఆయన ఎలాంటి ఎత్తులు వేస్తారనేది ఆసక్తికరమైన క్లైమాక్స్.