అంతుపట్టని”బాబు”చాణక్యం..!

chanakyam c

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్యం ఎక్కడ దాచుకుంది? నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న”బాబు” కేవలం దశాబ్ద కాలంగా రాజకీయ తెరపై కనిపిస్తున్న అమిత్ షా కోసం ఎందుకు పడిగాపులు కాశారు? బాబు ఎన్.డి.ఏ. కన్వీనర్ గా  ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఆ పర్యవసానమే ప్రస్తుత ఫలితమా?  ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆంధ్రా రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయ పరిశీలకులలోనూ సందేహాలు రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో  గత శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన తెలుగుదేశం, జనసేన పార్టీలు దేనికవి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తమ ఉనికిని కాపాడుకోవాలనే తపనలో ఉన్నాయి. చంద్రబాబునాయుడు అరెస్టు సాకుతో టిడిపికి “నేనున్నా” అంటూ జనసేన రాజమండ్రి కేంద్ర కారాగారంలో చేతులు కలిపింది. అప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ప్రతిపాదనకు తలవంచక తప్పలేదు. ఆంధ్రాలో  పవన్ కి, అయన పార్టీ ఎంత బలం ఉందో చంద్రబాబు నాయుడుకి తెలియని విషయం కాదు. తను జైలులో ఉంటే ఎదురయ్యే పరిణామాలను అంచనా వేసిన తర్వాతే తప్పని పరిస్థితిలో చంద్రబాబు పవన్ తో జోడీకి సై  అన్న మాట బహిరంగ రహస్యం. పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా కేవలం ఒక్క రాజోలు సీటును మత్రమే దక్కించుకున్న జనసేనతో, రాజకీయాల్లో అనేక ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న చంద్రబాబు పొత్తుకు దిగడంలోనే ఆయన రాజకీయ చతురత బయట పడింది.

babu modi 24 1

చంద్రబాబును జైలుకు పంపడంతో అధికార వైసిపి పై జనంలో తీవ్ర స్ధాయిలో వ్యతిరేకత పెరిగిందనేది అటు టిడిపి, జనసేన పార్టీల గట్టి నమ్మకం. అది ఎంతవరకు వాస్తవం అనేది ఆ రెండు పార్టీలే బేరీజు వేసుకోవాలి. అయితే, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆంధ్రాలో రాజకీయ పరిణామాలు రోజురోజుకీ శర వేగంగా మారుతున్నాయి. ఆ రాష్ట్రంలో సరైన శ్రేణులు లేని జనసేన, బిజెపిలు ఉనికి కోసం నానా తంటాలు పడుతున్నాయి. ప్రాంతీయ పార్టీగా ఎదగాలని ఆశించిన “సేన” గత ఎన్నికల్లో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆశించిన ఫలితాన్ని చూడలేక పోయిందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. వేదికలపై ఘాటైన ప్రసంగాలు, పంచ్ డైలాగులు కొడుతున్న జనసేన టిడిపి పొత్తులో కేవలం 24 నియోజక వర్గాలతోనే సరిపెట్టుకోవడంతోనే ఆంధ్రాలో  ఆ పార్టీ పట్టు ఎంతనేది తెలిపోయింది.  అదే బాటలో బిజెపి కూడా చేరిందనీ, అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భాజపా తరఫున బాధ్యత చేపట్టినా సున్నా ఫలితమే దక్కిందనేది మరో అంచనా.

24 BABU PVAN

ఇదిలా ఉంటే, భాజపాతో చేతులు కలపడానికి కొద్ది రోజులుగా చంద్రబాబునాయుడు పడ్డ పాట్లు రాజకీయ పరిశీలకులను ఆశ్చర్య పరుస్తున్నాయి. చంద్రబాబు ఎన్.డి.ఎ. కన్వీనర్ గా వెలిగిన రోజులను నెమర వేసుకుంటున్నారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ బాబుని కలవడానికి వేచి చేయాల్సిన పరిస్థితి ఉండేదని, కొన్ని సందర్భాలలో మోడీకి బాబు దర్శనమే భాగ్యంగా ఉండేదని, ఆ పర్యవసానమే ప్రస్తుత ఫలితంగా విశ్లేషిస్తున్నారు. అందుకే  మోడీని కలిసి పొత్తు వ్యవహారాన్ని తేల్చుకోవాల్సిన చంద్రబాబు అమిత్ షా దర్శనం కోసం వేచి చూడాల్సిన పరిస్థితికి దారి తీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీగా ఉన్న తెలుగదేశం దిశా,నిర్దేశం లేదనే అపోహ ఉన్న జనసేనతో చేతులు కలపడమే కాక, ఆ రాష్ట్రంలో ఆశించిన క్యాడర్ కూడా లేని భాజపాను కలుపుకొని పోవాలని “బాబు”తాపత్రయ పడడంలో రెండు కోణాలు కనిపిస్తున్నాయి. రాజకీయ, వ్యక్తిగత కక్ష సాధింపులకు దిగుతున్న అధికార పార్టీపై అక్కసుతో దాన్ని ఎలాగైనా గద్దె దించాలనే లక్ష్యం మొదటిది  కాగా, ఏదోఒక పార్టీ బలం ఉంటే బాగుంటుందనేది రెండో ఆలోచనగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయ చద రంగంలో ఆచితూచి పావులు కదిపే చంద్రబాబునాయుడు ప్రస్తుతం జనసేన, భాజపాలతో సంధికి సన్నద్ధమై ఎన్నికల బరిలోకి దిగుతున్నప్పటికీ ఆయన అసలు వ్యూహం ఏమిటనేది మాత్రం అంతర్గత రహస్యంగా మిగిలింది. ఎందుకంటే అధికార పోరులో బాబు ఆలోచనలు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకకుంటాయనే విషయం ఆయన గతం గురించి అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసిన సంగతే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *