మళ్లీ జన”గళం’….!

yuvac

ఆంధ్రప్రదేశ్ లో  ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జనగళమే “యువగళం”గా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79రోజుల సుదీర్ఘ విరామానంతరం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతోంది. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలన, అవినీతి బాగోతాన్ని ఎండగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నైపుణ్య అభివృద్ధి కేసులో  జైలుకు  వెళ్ళడంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. తర్వాత దేశ రాజధాని డిల్లీలో జగన్మోహన్ రెడ్డి అరాచకపర్వంపై  న్యాయపోరాటం చేస్తూనే యువనేత లోకేష్ జాతీయ స్థాయి నేతల మద్దతు కూడ గడుతూ జాతీయ మీడియాలో తమ గళాన్ని విన్పించే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న తీరును ఆమె దృష్టికి తెచ్చారు. అధినేతను అక్రమంగా నిర్బంధించి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకున్న కుట్రలను పటాపంచలుచేస్తూ న్యాయ దేవత ఆశీస్సులతో చంద్రన్న త్వరలో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారని లోకేష్ ప్రకటించారు. తాజా పరిణామాలను పార్టీ పెద్దలతో చర్చించిన యువనేత లోకేష అన్ని అడ్డంకులను అధిగమించి ఈనెల 27వతేదీ నుంచి గతంలో పాదయాత్ర  నిలిపి వేసిన రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి యువగళాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ కొనసాగనున్న యువగళం పాదయాత్ర  తుని మీదుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది.

babu 3 1

చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి జనవరి 27వతేదీన ప్రారంభమైన యువగళం 208రోజులపాటు కొనసాగి 2852.4 కి.మీ.ల మేర పూర్తయింది. ఇప్పటి వరకు 9 ఉమ్మడి జిల్లాల్లో 84 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. అనివార్యమైన సందర్భాల్లో మినహా యువగళం పాదయాత్రకు ఏనాడు విరామం ప్రకటించలేదు. అధికారపార్టీ వైఫల్యాలు, అవినీతిని యువనేత లోకేష్ మాటల తూటాలతో ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన తీరు వైసిపి నేతలకు కంటిమీద కునుకులేకుండా చేసింది. 208 రోజులపాటు సాగిన పాదయాత్రలో యువనేత లోకేష్ కు 4వేలకు పైగా వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా కలుసుకొని తమ సమస్యలు చెప్పుకున్నారు.యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలో 108 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుపార్టీ విజయదుందుభి మోగించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఇదిలా ఉంటే, తనపై అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపారనే అంశాన్ని జనం లోకి తీసుకువెళ్ళడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి యువగళాన్ని వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాక్,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని సైతం ఈ “గళం” లో తీసుకువచ్చే ప్రయత్నాలు సైతం మొదలైనట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన ఎత్తులు, పై ఎత్తులపై తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ఇప్పటికే కసరత్తు మొదలైంది.లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర ను ఇరు పార్టీలు ఏమేరకు ఉపయోగించుకుంటాయో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *